Holi 2023: హోలీ వేడుకకు మరి కొద్దిగంటలే సమయం మిగిలింది. దేశవ్యాప్తంగా మార్చ్ 8వ తేదీ బుధవారం నాడు హోలీ వేడుక జరుపుకోనున్నారు. హోలీ కోసం ఏడాది పొడుగునా నిరీక్షణ ఉంటుంది. ఈ వేడుకను ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. హోలీ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల్లో విభిన్న రకాలుగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల రంగులతో, ఇంకొన్ని చోట్ల బురదతో, మరి కొన్నిచోట్ల పూలతో జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలా జరుపుకుంటారో పరిశీలిద్దాం.
థాయ్‌లాండ్ థాయ్‌లాండ్‌లో ప్రతి ఏటా ఏప్రిల్ 13-15 తేదీల్లో సోంగ్‌క్రాన్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్బంగా ఒకరిపై మరొకరు చల్లటి నీరు విసురుకుంటారు. ప్రపంచంలో నీళ్లతో జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది
స్పెయిన్ ప్రతి యేటా ఆగస్టు నెల చివరి బుధవారం స్పెయిన్‌లోని బుయినోల్ పట్టణంలో లా టొమాటీనా పండుగ జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ టొమాటోలతో హోలీ జరుపుకుంటారు. ఒకరిపై మరొకరు టొమాటోలు విసురుకుంటారు. టొమాటోలను ప్రెస్ చేసి విసురుతుంటారు.
దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ప్రతియేటా జూలైలో మడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటారు. ఇది ఏకంగా 10 రోజులు జరిగే పండుగ. ఈ పండుగలో పాల్గొనేందుకు ప్రతియేటా 20-30 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
నార్తర్న్ స్పెయిన్ ఉత్తర స్పెయిన్‌లోని హారో పట్టణంలో ప్రతియేటా జూన్ 29వ తేదీన వైన్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వైన్ తాగే పోటీ జరుగుతుంది. ఒకరిపై మరొకరు వైన్ విసురుకుంటారు.
ఇటలీ ఇటలీ ఐవ్రియా పట్టణంలో ప్రతియేటా ఆరెంజ్ ఫైట్ ఉంటుంది. ఇది మూడ్రోజులపాటు జరుపుకునే పండుగ. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ఆరెంజెస్ విసురుకుంటారు. ఈ పండుగలో 400 టన్నుల కంటే ఎక్కువే ఆరెంజ్ వినియోగిస్తారు.