Financial Tips To Save Money: చాలా మంది డబ్బులు ఎంత సంపాదించినా.. సేవింగ్స్ ఉండట్లేదని బాధపడుతుంటారు. అనుకోని ఖర్చులతో సేవ్ చేసుకున్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో ఎంతో కొంత పొదుపు చేయడంతోపాటు ఇతర విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటంటే..?
మీ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయకపోతే ఇప్పటి నుంచి అయినా చేయండి. మీ ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆ టైమ్‌లో ఒత్తిడి లేకుండా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెలవారీ స్థిర పెట్టుబడితో రిటైర్మెంట్ తరువాత మీ జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు. వీపీఎఫ్, ఈఎల్‌ఎస్ఎస్, పీఎఫ్ వంటి పన్ను ఆదా పథకాలలో ఇన్వెస్ట్ చేయాలి.
ఇంట్లో ఖర్చులకు కచ్చితంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో లెక్కలు వేసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకుని కాస్త పొదుపు చేయడం అలవాటు చేసుకోండి.
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ కచ్చితంగా చేయించుకోండి. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే బీమా ఎంతో ఉపయోగపడుతుంది. హాస్పిటల్ బిల్లుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
మీ బిల్లులను సకాలంలో చెల్లించాలని గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులను ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌తో సహా ఇతర ప్రయోజనాలతో పాటు వడ్డీ రహిత డబ్బును 40-50 రోజుల పాటు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే సకాలంలో బిల్లులు చెల్లించి లబ్ధిపొందండి.
మీరు క్రమం తప్పకుండా పొదుపు చేయకపోతే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు. మీ సంపాదనలో ప్రతి నెలా 20 శాతం వరకు సేవింగ్ అమౌంట్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.