8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి డీఏ 3 శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. అదే సమయంలో 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తవ్వగా.. 2016 నుంచి సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పే కమిషన్‌కు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని ఉద్యోగులు నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల జీతం, ఇతర ప్రయోజనాలతో సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త పే కమిషన్ సిఫార్సులు సిద్ధం చేస్తుంది. కొత్త కమిటీని ఈ ఏడాది ఏర్పాటు చేసినా.. సిఫార్సులు 2026 నుంచి అమలులోకి వస్తాయి.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.68కి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జీతాల పెంపు భారీగా ఉంటుంది.
సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తోంది. 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. అంతకుముందు 2014లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు కొత్త పే కమిషన్ నోటిఫికేషన్ వస్తే 2026 నాటికి అమలులోకి రావచ్చు.
ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్ పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. అంటే ఆ లోపు 8వ వేతన సంఘం అమలు ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం, నెలవారీ వేతనం, అలవెన్సులు, డియర్నెస్ అలవెన్స్, పెన్షన్లలో మార్పులు ఉంటాయి.
8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రావాలని.. అందుకు ఇంకా సమయం ఉందని ఇటీవల ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68కి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 6వ వేతన సంఘం 1.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండగా.. 7వ వేతన సంఘంలో 2.57కి పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ పే నెలకు రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. దీంతోపాటు కనీస పింఛన్ కూడా రూ.3500 నుంచి రూ.9 వేలకి పెరిగింది. గరిష్ట వేతనం రూ.2.50 లక్షలకు, గరిష్ట పెన్షన్ రూ.1.25 లక్షలకు మార్చారు.
కొత్త పే కమిషన్ అమల్లోకి వస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.68కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో 44 శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కనీస పింఛను రూ.17,280కి చేరవచ్చని అంటున్నారు.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను సందర్శించండి.