Sonia Gandhi Innings: సోనియా కుటుంబ, రాజకీయ జీవితపు ఇన్నింగ్స్‌లో కీలక ఘట్టాలు, అంశాలు, ఆశ్చర్యకర పరిణామాలు

Sonia Gandhi Innings: సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి చెప్పేశారా లేదా కేవలం పార్టీ అధ్యక్ష బాధ్యతలకే వీడ్కోలు చెప్పారా. ఇన్నింగ్స్ ముగిసిందని చెప్పడం దేనికి సంకేతమో అర్ధం కాక పార్టీ శ్రేణులు మళ్లగుల్లాలు పడుతున్నారు. ఒకటి మాత్రం నిజం ఆమె ప్రస్థానం.. 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికార కేంద్రంగానే సాగింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2023, 07:40 PM IST
Sonia Gandhi Innings: సోనియా కుటుంబ, రాజకీయ జీవితపు ఇన్నింగ్స్‌లో కీలక ఘట్టాలు, అంశాలు, ఆశ్చర్యకర పరిణామాలు

ముందు కళ్లెదుట అత్త హత్య..ఆ తరువాత భర్త దారుణ హత్య నేపధ్యంలో రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఏళ్ల తరబడి రాజకీయాలకు నో చెప్పిన సోనియా గాంధీ..హఠాత్తుగా 1997లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దిగారు. ఇప్పుడు 35 ఏళ్ల తరువాత ఇన్నింగ్స్ తెరపడిందని చెప్పడంతో సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 

సరే..ఆమె రాజకీయాల్లో కొనసాగుతారా లేదా పార్టీ బాధ్యతలకే దూరంగా ఉన్నారా అనేది పక్కనబెడితే..అసలు ఆమె రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది, కుటుంబ నేపధ్యమేంటనే ఆసక్తికర అంశాలు మీ కోసం..

సోనియా గాంధీ తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షురాలై 25 ఏళ్లైంది. 1998లో పార్టీ బాధ్యతలు చేపట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. కేవలం దశాబ్దంలోపే ఆ పార్టీకు చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. ఆ సమయానికి కేవలం మూడే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆమె నేతృత్వంలో రెండు సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం ద్వారా ఓ దశలో 16 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది పార్టీ. 

రాజకీయాల్లో రానని పలుమార్లు చెప్పడమే కాకుండా భర్త రాజీవ్ గాంధీని కూడా రాజకీయాల్లోకి వెళ్లవద్దని చెప్పిన సోనియా గాంధీ చివరి వరకూ కాంగ్రెస్ పార్టీ అధికార కేంద్రంగా ఎలా గడిపారనేది అంతకంటే ఆశ్చర్యకరమైన ఘటన. కేవలం 46 ఏళ్ల వయస్సులో భర్త రాజీవ్ గాంధీ హత్యానంతరం అసలు కధ ప్రారంభమైంది. 

1946 డిసెంబర్ 9వ తేదీన జన్మించిన సోనియా గాంధీ ఇటలీలో రోమన్ కాథెలిక్‌గా ఎదిగారు. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు నాదియా, అనౌష్కా. 1964లో ఇంగ్లీషు విద్య కోసం ఇంగ్లండ్ కేంబ్రిడ్జ్‌కు వెళ్లినప్పుడు రాజీవ్ గాంధీతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 1968లో హిందూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత అత్త ఇందిరా గాంధీ ఇంటికి వచ్చేశారు సోనియా గాంధీ. కీర్తి ప్రతిష్టలుండే ప్రపంచంలో, కుట్రలు, హింసకు కేరాఫ్‌గా నిలిచే భారతదేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

1984లో ఇందిరా గాంధీ హత్యతో ముందుగా ఘటనా స్థలానికి చేరుకున్నది సోనియా గాంధీనే. తన ఒడిలో ఇందిరమ్మ తలను ఉంచుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇందిర హత్యానంతరం పైలట్ వృత్తిలో ఉన్న భర్త రాజీవ్ గాంధీ తల్లి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాల్సి ఉంది. కానీ ఆమె నిర్ద్వందంగా తిరస్కరించారు. కానీ అనివార్యమైంది. ఫలితం ఆమె అనుమానించినట్టే..1991లో తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురయ్యారు. 

సోనియా గాంధీ భర్త రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో చేరేందుకు నిరాకరించడమే కాకుండా..1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ప్రచారం చేసేందుకు కూడా తిరస్కరించారు. అంతకుముందు ఒకే ఒకసారి తోడి కోడలు మేనకా గాంధీకు వ్యతిరేకంగా అమేథీలో రాజీవ్ గాంధీ కోసం ప్రచారం చేశారు. అది కూడా 1984 ఇందిర హత్యానంతరం. 

1997 డిసెంబర్‌లో సోనియా గాంధీ హఠాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్నారు. 1998 మార్చ్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆమె మనసు మార్చుకోడానికి కారణమేంటనేది ఇప్పటికీ తెలియని అంశమే. అయితే భర్త పేరు ప్రతిష్ఠలు మరుగున పడకుండా చూడటం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దేశ రాజకీయాల్లో తన కుమారుడికి భవిష్యత్ ఇవ్వాల్సిన పరిస్థితి నేపధ్యంలో సోనియా మనసు మార్చుకున్నారనేది రాజకీయ పరిశీలకుల భావన.

1887లో సోనియా గాంధీ కోల్‌కత్తా ప్లీనరీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలయ్యారు. 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 సీట్లు గెల్చుకుంది.  సీతారాం కేసరిని తొలగించి..సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ పరిణామం అందరికీ రుచించలేదు. 1999 మే నెలలో ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌లు సోనియా విదేశీయతపై గళమెత్తారు. సోనియా వైదొలగేందుకు సిద్దమైనా..కాంగ్రెస్ పార్టీలో ఇతరులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. శరద్ పవర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపనతో సొంత శిబిరం పెట్టుకోవడంతో సోనియా స్థానం సుస్థిరమైంది. 

1999 ఎన్నికల్లో ఇక ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగారు సోనియా గాంధీ. ఉత్తరప్రదేశ్ అమేథీ నుంచి కర్ణాటక బళ్లారి నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. ఆమెపై పోటీ చేసిన సుష్మ స్వరాజ్ ఓటమి పాలయ్యారు. సోనియా గాంధీ రాజకీయాల్లో ప్రవేశించిన తొలినాళ్లలో..పూర్తి హిందీలోనే ప్రసంగాలు సాగాయి. నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీపైనే కాకుండా భారత రాజకీయాల్లోనే శక్తివంతమైన ఆధిపత్యం చెలాయించారు. 

1998లో సోనియా చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. మీలో కొందరు భావించే విధంగా నేనేమీ పార్టీని రక్షించేదాన్ని కాను, మనం వాస్తవిక అంచనాల్లో ఉండాలి. పార్టీ పునరుజ్జీవమనేది ప్రతి ఒక్కరి చిత్తశుద్ధి, ప్రయత్నంతో దీర్ఘకాలంలో జరిగే ప్రక్రియ అని 1998లో పార్టీ అధ్యక్షురాలిగా పదవీ బాథ్యతలు తీసుకున్నప్పుడు సోనియా చెప్పిన మాటలు. 

చెప్పినట్టే సోనియా గాంధీ చాలా అంచనాల్ని మించిపోయారు. 2004లో అధికారంలో వచ్చినా విదేశీయత ఆరోపణల నేపధ్యంలో ప్రధాని పదవికి దూరమై..ఆ పదవిలో మన్మోహన్ సింగ్‌ను కూర్చోబెట్టారు. అనంతరం 2009లో మరోసారి అధికారం చేజిక్కించుకున్నాక కూడా మన్మోహన్ సింగ్‌కే పట్టం కట్టారు.

Also read: Gujarat Earthquake: గుజరాత్‌లో కంపించిన భూకంపం.. భయపెడుతున్న వరుస ఘటనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News