Nayanthara's Connect Movie Telugu Review: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార నటించిన తాజా హారర్ థ్రిల్లర్ మూవీ ‘కనెక్ట్’. ఈ సినిమాని రౌడీ పిక్చర్స్ బ్యానర్ మీద ఆమె భర్త విగ్నేష్ శివన్ నిర్మించడం గమనార్హం. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమాని తెరకెక్కించడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో అశ్విన్ శరవణన్ కు మంచి అనుభవం ఉంది. నయనతార హీరోయిన్ గా గతంలో ఆయన రూపొందించిన ‘మాయ’ అనే సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత ఆయన రూపొందించిన గేమ్ ఓవర్ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ నేపథ్యంలో కనెక్ట్ సినిమా మీద అంచనాలు పెరిగాయి దానికి తగినట్లుగానే సినిమా ట్రైలర్ కూడా ఉండడంతో సినిమా మీద మరింత అంచనాలు పెరిగినట్లు అయింది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ఘనంగా విడుదలవుతోంది కానీ ముందుగా తమిళ, తెలుగు మీడియా ప్రతినిధులకు సినిమా స్పెషల్ షో వేసి చూపించారు. మంగళవారం నాడు ఈ సినిమా స్పెషల్ షో తెలుగు మీడియా ప్రతినిధులకు కూడా చూపించారు. అయితే అంతగా అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కనెక్ట్ కథ ఏమిటంటే?
ఈ సినిమా కథ అంతా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. జోసెఫ్ బినోయ్(వినయ్ రాయ్), ఒక పేరు మోసిన హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య సుసాన్(నయనతార) హౌస్ వైఫ్ కాగా కుమార్ అన్నా(హానియా నఫీస్) స్కూల్లో చదువుకుంటూనే మరోపక్క మ్యూజిక్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది. ఆమె లండన్ లో హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్ లో సీటు తెచ్చుకోగా ఆమె అక్కడికి వెళ్లే లోపే కరోనా లాక్ డౌన్ వచ్చేస్తుంది.
కరోనాలో పేషెంట్లకు చికిత్స అందిస్తూనే జోసెఫ్ కరోనా బారిన పడి కన్నుమూస్తాడు. అతను చనిపోయే ముందు కుమార్తెను ఒకసారి పాట పాడమని అడిగితే ఆమె పాడకుండా బాధతో బయటకు వెళ్ళిపోతుంది. తన తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయాను అనే బాధలో ఉండిపోయిన ఆమె ఎలా అయినా తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని, ఆత్మ ముందు అయినా పాడాలని ఆత్మలతో మాట్లాడే టెక్నీక్ ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించిన సమయంలో ఆమెలో ఒక దుష్ట ఆత్మ ప్రవేశిస్తుంది. తన కుమార్తెలో ప్రవేశించిన దుష్ట ఆత్మను నయనతార, ఆమె తండ్రి ఆర్థర్(సత్యరాజ్) ఎలా దూరం చేశారు అనేది ఈ సినిమా కథ
విశ్లేషణ
ఈ సినిమా అంతా కూడా కేవలం ఒకే ఇంట్లో తీశారు అంటే అతిశయోక్తి కాదు. చాలా తక్కువ బడ్జెట్ పరిమితులతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్. అశ్విన్ భార్య కావ్య రామ్ కుమార్ ఈ సినిమాకి కథ అందించగా నయనతార, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సత్యరాజ్, అనుపమ ఖేర్ ఇతర కీలక పాత్రలో నటించారు. కేవలం లొకేషన్ ఖర్చు, నటీనటుల రెమ్యునరేషన్ మినహా సినిమాకి పెద్దగా ఖర్చు అయిన దాఖలాలు కూడా కనిపించే లేదు. సినిమా ప్రారంభంలో కాస్త బోర్ కొట్టిస్తుంది కానీ అసలు కథలోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతారు.
నయనతార కుమార్తెకి దుష్ట ఆత్మ ప్రవేశించినప్పటి నుంచి సినిమా అందరిలోనూ ఆసక్తి పెంచుతుంది. క్లైమాక్స్ వరకు కూడా ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి తర్వాత ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అనూహ్యంగా ఇంకా సినిమా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. సినిమా క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే ఆడియన్స్ కు మరింత కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది.
అయితే ఆన్లైన్ ద్వారానే ఆత్మలను పిలిపించుకోవడం, పారద్రోలడం అనేది కొంచెం కొత్తగా అనిపించినా అదే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. కాకపోతే క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అయితే చిన్న సినిమా కావడంతో ఇంటర్వెల్ కూడా లేకుండానే సినిమా మొత్తాన్ని ప్రదర్శించడానికి దర్శకుడు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. మొత్తం మీద సినిమాలో క్లైమాక్స్ లో కొందరు ఇంకా ఏదైనా క్లారిటీ ఇస్తారని భావిస్తారు, సో ఇప్పుడున్న క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ సినిమాగా చూస్తే మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.
నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమా ఆద్యంతం నయనతార తనదైన శైలిలో ముందుకు తీసుకు వెళ్ళింది. వినయ్ రాయ్ పాత్ర చిన్నది అయినా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక నయనతార తండ్రి పాత్రలో సత్యరాజ్, ఫాదర్ అగస్టయిన్ పాత్రలో అనుపమ్ ఖేర్ తమ అనుభవాన్ని రంగరించి నటించారు.
అనుపమ కేర్ నటన సినిమాకి బాగా ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది ఇక అన్నా పాత్రలో నటించిన హానియా నఫీస్ కి మొదటి సినిమా అయినా ఆమె ఏమాత్రం బెరుకు లేకుండా నటించింది. అద్భుతమైన నటనతో సినిమాని మరో లెవల్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రధారులు అందరూ ఒకటి రెండు సీన్లకే పరిమితమైనా తమ పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు
టెక్నికల్ టీమ్
టెక్నికల్ యాస్పెక్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మూల కథ అందించిన కావ్య రామ్ కుమార్ చాలా చిన్న లైన్ ని తీసుకుని కథ మొత్తం అల్లుకున్నారు. దాన్ని ఆమె భర్త అశ్విన్ పెర్ఫెక్ట్ గా ఎక్సిక్యూట్ చేశారు. అయితే ప్రేక్షకులు కొత్త ప్రయోగాలు, కొత్త అటెంప్ట్స్ ని ఆదరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త అటెంప్ట్ అనిపించింది. కేవలం ఒకే ఇంట్లో చాలా తక్కువ బడ్జెట్ తో పరిమిత టీం తో పనిచేసినట్లుగా అనిపిస్తుంది.
అయినా సరే సినిమాలో చాలా సీన్లు బాగా కుదిరాయి, సినిమాలో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ సినిమాని మరో లెవల్కు తీసుకు వెళ్లాయి. దాదాపు నాలుగైదు చోట్ల ప్రేక్షకులు వణికి పోయే విధంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు తమ పనితనాన్ని చూపాయి. మణికంఠన్, కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయింది, అదేవిధంగా పృథ్వి చంద్రశేఖరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. 99 నిమిషాలలో రూపొందిన ఈ సినిమా టెక్నికల్ పరంగా చాలా బాగుంది నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగినట్లుగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే
కనెక్ట్ సినిమా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు కానీ హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడేవారు కచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా.
రేటింగ్: 2.75/5
Also Read: Samantha: సినిమాలకు గుడ్‌బై చెప్పడంపై..స్పష్టత ఇచ్చిన సమంత
Also Read: HIT 2 on OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హిట్ 2 , ఎప్పుడు, ఎందులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Connect Movie Review: నయనతార 'కనెక్ట్' మూవీ కనెక్ట్ అయ్యేలానే ఉందా? రేటింగ్ ఎంతంటే?