తెలుగు సినీ పరిశ్రమ తీరును చూస్తే తనకే సిగ్గేస్తోంది అని అన్నారు ప్రముఖ సినీ నటి, నిర్మాత జీవిత రాజశేఖర్. డ్రగ్స్ వ్యవహారం తెరపైకొచ్చినప్పుడూ ఎవ్వరూ ఆ వివాదంపై నోరు విప్పలేదు. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ, ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఇప్పుడు కూడా ఎవ్వరూ స్పందించడం లేదు. ఈ విషయంలో వేలు పెట్టి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకులే అని ఎవరికి వారే ఈ వివాదానికి దూరం జరుగుతున్నారే తప్పితే... అయ్యో మన సినీ పరిశ్రమపై ఎవరో ఇన్ని ఆరోపణలు చేస్తోంటే మనం ఎందుకు స్పందించకూడదని అనుకోకపోవడం మాత్రం చాలా సిగ్గుచేటు అని జీవిత ఆవేదన వ్యక్తంచేశారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎక్కువయ్యాయని ఇటీవల కాలంలో పలువురు యువ నటీమణులు చేస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ మంగళవారం సాయంత్రం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో వున్నట్టుగానే సినీ పరిశ్రమలోనూ నటీనటుల ఎంపిక కోసం పలు ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు వున్నాయని, అయితే, ఏదేమైనా టాలెంట్ వున్న వాళ్లను మాత్రమే అవకాశాలు వెదుక్కుంటూ వెళ్తాయని అభిప్రాయపడ్డారామె.
ఎవరో కొంతమంది, కొన్ని ఏజెన్సీలను నమ్ముకుని మోసపోయి వుండవచ్చు. అంతమాత్రానికే మొత్తం సినీ పరిశ్రమను ఆరోపిస్తే, సరికాదు అని అన్నారామె. అయితే, అదేక్రమంలో తెలుగు సినీ పరిశ్రమపై వస్తోన్న ఆరోపణలను సైతం తిప్పి కొట్టాల్సిన అవసరం సినీ ప్రముఖులపై వుందని జీవిత గుర్తుచేశారు. దయచేసి సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరు ఎక్కడున్నా ఈ వివాదంపై స్పందించండి. ఒకవేళ మీడియాకు అందుబాటులో లేకపోతే, మీ ఫేస్‌బుక్, ట్విటర్ ఎకౌంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోండి. అంతేకానీ ఇలా మౌనంగా వుండి నిజంగానే పరిశ్రమపై వస్తోన్న ఆరోపణల్లో నిజం వుందనే సంకేతాలు ఇవ్వకండి అని సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.
జీవిత చేసిన ఈ విజ్ఞప్తిపై తెలుగు సినీ ప్రముఖులు స్పందిస్తారా ? పరిశ్రమలో లైంగిక వేధింపులు లేనే లేవు అని చెప్పడానికైనా ఎవరైనా ముందుకొస్తారా ? తెలుగు సినీ పరిశ్రమ తీరు చూస్తే సిగ్గేస్తోంది అని జీవిత చేసిన ఘాటు వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమ నుండి వచ్చే రియాక్షన్ ఎలా వుండనుందో వేచిచూడాల్సిందే మరి!!
సినీ పరిశ్రమ తీరు సిగ్గనిపిస్తోంది : జీవిత