Leopard Warning: రాజమండ్రి ప్రజలకు ఇది హెచ్చరిక. చిరుతపులి తిరుగుతోంది. సాయంత్రం పూట ఎవరూ బయటకు రావద్దని, పిల్లల్ని ఆడుకునేందుకు పంపించవద్దని అటవీ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావలసి వస్తే ఇద్దరు లేదా ముగ్గురు తోడుండి, వెంట టార్చ్ లైట్ ఉండాలంటున్నారు.
రాజమండ్రి పాంతంలో చిరుతపులి సంచారంపై హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా దివాన్ చెరువు, లాలాచెరువు ప్రాంతాలతో పాటు స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూప నగర్, శ్రీరామ్ నగర్, తారక రామనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు సాయంత్రం వేళ బయటకు రావద్దని, ఆరు బయట కూర్చోవద్దని సూచిస్తున్నారు. ఇంటి ప్రధాన గుమ్మం తలుపులు లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లల్ని సాయంత్రం వేళ ట్యూషన్లకు లేదా ఆడుకునేందుకు బయటకు పంపించవద్దంటున్నారు. దివాన్ చెరువు సమీపంలో లభ్యమైన చిరుతపులి పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు చిరుతపులి సంచారాన్ని ధృవీకరించారు. చిరుతపులి సంచారం ఉందని డీఎఫ్ఓ భరణి స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు చిరుతపులి మనుషులపై దాడి జరిపిన ఘటన లేదన్నారు. త్వరలోనే చిరుతపులిని పట్టుకుంటామన్నారు. అనుమానిత ప్రదేశాల్లో ట్రాప్ కెమేరాలు, బోన్లు ఏర్పాటు చేశామన్నారు. చిరుతపులి సంచారానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తెలుపాలని డీఎఫ్ఓ భరణి తెలిపారు. చిరుతపులి సంచారంపై హెచ్చరికల నేపద్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రయితే చాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే దండోరా వేయిస్తున్నారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రాజమండ్రి నగరంలో చిరుతపులి సంచారం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా జరిగింది. నగరం నడిబొడ్డున లలితా నగర్లో ఓసారి ఓ ఇంట్లో దాక్కున్న పులిని పట్టుకున్నారు. అడ్డతీగల, మారేడుమిల్లి ప్రాంతం నుంచి దారి తప్పి ఇటు వస్తున్నాయి. రాజమండ్రి శివార్లలో దివాన్ చెరువు, శ్రీరాంపురం ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా చిరుత పులులు వస్తున్నట్టు తెలుస్తోంది.
Also read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.