Income Tax Returns: జూలై 31వ తేదీతో ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసే చివరి తేదీ ముగిసిపోయింది.అయితే ఇప్పుడు పన్ను చెల్లింపుదారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరాధ రుసుము ఎంత చెల్లించాలి. ఏమేం ప్రయోజనాలు కోల్పోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
IT Returns: జూలై 31 అర్ధరాత్రి తో ఐటిఆర్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి గడువు ముగిసిపోయింది. అయితే ఇప్పటికే దాదాపు 7 కోట్ల మంది తమ రిటర్న్‌స్ దాఖలు చేసినట్లు ఇంకమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తమ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎవరైతే ఆదాయపన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌స్ ఫైల్ చేయలేదో వారికి మరో అవకాశం కూడా ఉంది. అయితే వారు పెనాల్టీ చెల్లించి ఈ సౌలభ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే చివరి గడువు తేదీని పెంచాలి అనే డిమాండ్లు ఎన్ని వచ్చినప్పటికీ, ఆదాయ పన్ను శాఖ వారు మాత్రం ఇప్పటివరకు కేటాయించిన సమయం సరిపోతుందని పేర్కొంది. పన్ను చెల్లింపు దారులు చేసిన డిమాండ్ ను పక్కకు పెట్టింది. కాగా ప్రస్తుతం ఎవరైతే రిటర్న్‌స్ ఫైల్ చేయలేకపోయారో వారు ఏమేం ప్రయోజనాలు పొందలేకపోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొత్త పన్ను విధానంలోకి డీఫాల్ట్‌గా మారిపోతారు: ఎవరైతే గడువు తేదీలోగా రిటర్న్‌స్ ఫైల్ చేయలేదో వారు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానంలోకి మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరైతే పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక చేసుకోకుండా ఉంటారో వారు కొత్త పన్ను విధానంలోకి డిఫాల్ట్ గా షిఫ్ట్ అవుతారు. దీనివల్ల పాత పన్ను విధానంలోని పలు మినహాయింపులను వారు కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే కొత్త పన్ను విధానం ప్రకారం అదనంగా చెల్లించాల్సినవి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
గడువు దాటితే పెనాల్టీ: జూలై 31వ తేదీలోగా ఎవరైతే ఐటిఆర్ రిటర్న్ ఫైల్ చేయలేదో వారు పెనాల్టీ చెల్లించి తమ రిటర్న్ లను ఫైల్ చేయవచ్చు. అయితే ఇది కూడా డిసెంబర్ 31 వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందన్న సంగతి గుర్తించాలి. ఎవరికైతే రూ. 5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటుందో వారు సుమారు రూ. 5000 వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఎవరి ఆదాయం అయితే రూ.5 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వారు వెయ్యి రూపాయల వరకు పెనాల్టీ చెల్లించాలి. మీరు జీరో ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
రీఫండ్ ఆలస్యం అవుతుంది:ఎవరైతే జూలై 31 అనంతరం రిటర్న్‌స్ దాఖలు చేస్తారో వారు ఆలస్యంగా రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐటి శాఖ వారు గడువు తేదీ దాటిన వారి రిటర్న్‌స్ పరిశీలించడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా రిఫండ్స్ తో పాటు టిడిఎస్ వంటివి కూడా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది.
బెనిఫిట్ లను పొందలేరు:కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లలోను ఇతర పెట్టుబడులలో నష్టాలను పొందుతారో వారు గడువు తేదీలోగా తమ రిటర్న్‌స్ ఫైల్ చేయకపోతే, వచ్చే సంవత్సరం ఐటిఆర్లో మీ నష్టాలను చూపించలేరు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇతర వ్యాపారాలకు ఇది వర్తిస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి.