Virat Kohli RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారైనా కప్ కొడుతుందా..? విరాట్ కోహ్లీ ఖాతాలో ఐపీఎల్ టోర్నీ చేరుతుందా..? ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి అభిమానుల్లో ఇదే చర్చ. జట్టులో హేమాహేమీలు ఉన్నా.. స్టార్ ప్లేయర్లకు కొదవలేకున్నా ఆర్సీబీకి మాత్రం ఐపీఎల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు రాయల్ ఛాలెంజర్స్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మొదటి సీజన్ నుంచి టీమ్తోపాటే ఉన్న విరాట్ కోహ్లీ ఈసారి బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఐపీఎల్ 2025 వేలానికి ముందు బీసీసీఐ నిబంధనలు రూపొందంచనుంది. ఏ టీమ్ ఎంత మంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలనే విషయంపై క్లారిటీ ఇవ్వనుంది. ఐపీఎల్ టీమ్ యజమానులతో ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో సమావేశం నిర్వహించనుంది.
అదేవిధంగా ఆటగాళ్ల వేలం మొత్తం, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో ఐపీఎల్ వేలం తేదీని కూడా ఖరారు చేయనున్నారు.
ఐపీఎల్ వేలం తేదీలను ఖరారు అయిన తరువాత వేలానికి ఒక నెల ముందు అన్ని జట్లు కూడా తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను అందజేయాలి. ఇందుకు బీసీసీఐ డెడ్‌లైన్ కూడా విధిస్తుంది.
గతంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నిబంధన మార్చాలని అన్ని జట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను పెంచాలని కోరుతున్నాయి. ఒక వేళ బీసీసీఐ అనుమతించకపోతే అన్ని జట్లూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.
సీజన్ ఆరంభం నుంచి కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకునే అవకాశాల్లేవని అంటున్నారు.
టీమ్‌లో వ్యక్తిగతంగా ఆడుతున్నా.. జట్టుగా ఆడటంలో ఆటగాళ్లందరూ విఫమలవుతున్నారు. టీమ్‌లో VIP సంస్కృతి కారణంగా జట్టు ట్రోఫీని గెలవకపోవడానికి చాలా మంది మాజీలు కూడా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
కోహ్లీ అంటే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటే కోహ్లీలా మారిపోయిన తరుణంలో ఈ రన్ మెషిన్‌ను ఆర్సీబీ వదులుకుంటుందా..? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీని రిలీజ్ చేయడంపై ఆర్సీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక వేళ కోహ్లీ ఆర్సీబీని వీడితే ఇది అభిమానులకు బిగ్ షాకింగ్ అవుతుంది.