Kalyana Laxmi Scheme Money: పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఒకటైన కళ్యాణలక్ష్మి పథకం ఎలా దుర్వినియోగం అవుతుందో కళ్లకు కట్టే సాక్ష్యం ఇది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి పథకంలో అధికార పార్టీ నాయకులు తమ చేతి వాటం చూపించారు. కూసుమంచి మండలానికి చెందిన ఒక మహిళకు 2017 లో వివాహం జరిగింది. కిష్టాపురం అంగన్ వాడీ కేంద్రంలో 2019 జనవరి 2వ తేదీన గర్భిణీగా నమోదు చేయించుకుని గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం నుంచి అందించే పౌష్టికాహారం కూడా నెల నెల తీసుకున్నట్లు రికార్డులో నమోదైంది. ఆ తరువాత ఆ మహిళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రెండో కాన్పులో మరో బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ఇదిలావుంటే, అధికార పార్టీ నేతల వక్ర బుద్ధితో ప్రభుత్వ సొమ్మును కాజేయాలని దురుద్దేశంతో అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న ఆ మహిళకు మరోసారి పెళ్లి అయినట్టు డాక్యుమెంట్స్ సృష్టించి కళ్యాణ లక్ష్మి పథకం నిధులను కాజేసే ప్రయత్నం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద వచ్చే దాంట్లో తమకు వాటా ఇస్తే మిగతాదంతా తామే చుసుకుంటామని ఆ మహిళను నమ్మించి ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఆమెకు 16-08-2021 న పెళ్లి అయినట్లుగా ధృవీకరణ పత్రం కూడా తీసుకున్నారు.
2022 నవంబర్ 4వ తేదీన స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తుదారురాలి విజ్ఞప్తి మేరకు 2021 ఆగస్టు 16న హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు రిజిస్ట్రార్ వివాహ ధ్రువీకరణ పత్రం ఆమెకు అందించారు. రిజిస్ట్రార్ అందించిన ఈ మ్యారేజ్ సర్టిఫికెట్తో పాటు 2021 ఆగస్టు 16న వివాహం జరిగినట్లు పెళ్లి కార్డులు, ఫొటోలు అన్నీ తయారు చేయించి కళ్యాణ లక్ష్మీ పథకం కోసం మీసేవాలో దరఖాస్తు చేసుకున్నారు.
అనంతరం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సిఫారసు మేరకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద అందించే నగదు ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కును అందుకుని తమ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారమే ఆ మహిళకు ఇచ్చే వాటా ఇచ్చేసి మిగతా మొత్తాన్ని కందాల ఉపేందర్ రెడ్డి అనుచరులు పంచుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా.. ఇలాంటి ఘటనలు పాలేరు నియోజకవర్గంలో కోకొల్లలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. అన్నిరకాల ప్రజా సంక్షేమ పథకాల్లో ఇలాగే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అని అక్కడి స్థానికులు, ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అనుచరులకు వరంగా మారింది అని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే కాకుండా, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి, ప్రజా ధనాన్ని కాజేస్తోన్న ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలేరు నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందా అనే చర్చలతోనే ఇప్పటివరకు వార్తల్లోకెక్కిన పాలేరు నియోజకవర్గం తాజాగా జరిగిన ఈ ఫోర్జరీ, ఫ్రాడ్ కేసుతో మరోసారి ఇలా వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి : 35 BRS Leaders To Join Congress: కాంగ్రెస్‌లో చేరనున్న 35 మంది బీఆర్ఎస్ నేతలు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK