లోక్‌పాల్ బిల్లు అమలులోకి రావాలని పోరాటం చేసిన సామాజిక వేత్త అన్నా హజారే భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ లాంటి అహంకారిని తాను జీవితంలో చూడలేదని తెలిపారు. గత మూడేళ్ళుగా తాను రాసిన ఏ ఉత్తరానికి కూడా మోదీ జవాబు ఇవ్వలేదని.. దీన్ని బట్టే ఆయనకు ఎంత అహంకారం ఉందో అర్థం చేసుకోవచ్చని హజారే ఆరోపించారు.
మహారాష్ట్రలోని సంగ్లి ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరైన హజారే మాట్లాడుతూ, దాదాపు మోదీకి తాను 30 ఉత్తరాలు వరకూ రాసుంటానని తెలిపారు. హజారే గతంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరాహారదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో కూడా హజారే మాట్లాడుతూ ధర్నాలు, ఉద్యమాలు చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడిగే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.
లోక్‌పాల్ కోసం ఎలా జనాలు ఉద్యమిస్తున్నారో.. రైతులు కూడా తమ సమస్యల పరిష్కారానికి అలాగే ఉద్యమించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్ పాల్ అమలులోకి తీసుకురావడంతో పాటు లోకాయుక్తను అపాయింట్ చేయడం, అలాగే రైతులకు నెలకు 5000 పింఛను సదుపాయం కూడా కల్పించాలన్నవే తన డిమాండ్లని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజారే కేజ్రీవాల్ పై కూడా విమర్శలు కురిపించారు. తనతో కలసి ఉద్యమంలో పాల్గొనేవారు రాజకీయాల్లోకి వెళ్లి మంత్రి పదవులు పొందాలని ఆశించకూడదని తెలిపారు.
మోదీ ఒక అహంకారి: అన్నాహజారే