భోపాల్: మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం (Madhya pradesh political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పినప్పటి నుంచి మొదలైన ఈ రాజకీయ సంక్షోభం.. చివరకు మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని ఇబ్బందుల్లో పడేసే వరకు వెళ్లింది. సింధియా వెంటే 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌కి కష్టాలు అధికమయ్యాయి. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ (BJP)లో చేరిన అనంతరం పరిణామాలు పరిశీలిస్తే.. కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath govt) ఈ కష్టాన్ని గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కమల్ నాథ్ కూడా రానురాను ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కోల్పోతున్నట్టు కనిపిస్తోందని ఆయన మాటలే చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనావైరస్‌ని (Coronavirus) ఎదుర్కోవడానికి మధ్యప్రదేశ్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా అడిగిన ప్రశ్నకు కమల్ నాథ్ స్పందిస్తూ... ఇక్కడ రాజకీయాలకే కరోనా సోకిందని.. ఏం జరగనుందో వేచిచూడాల్సిందేనని అన్నారు. కమల్ నాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ విశ్లేషకులు అలా భావించడానికి ఓ కారణమయ్యాయని తెలుస్తోంది. కమల్ నాథ్ సమాధానం వింటుంటే ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇదిలావుంటే, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చి... ఆ బల పరీక్షలో కమల్ నాథ్ సర్కార్ నెగ్గకపోయినట్టయితే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయం. ఒకవేళ అదేకానీ జరిగితే.. బీజేపీ తరపున సీఎం క్యాండిడెట్ ఎవరనే ప్రశ్న (who is next CM of Madhya Pradesh) ఉత్పన్నమవుతోంది. మధ్య ప్రదేశ్ నెక్ట్స్ సీఎం ఎవరనే ప్రశ్న తలెత్తినప్పుడు బీజేపికి వెంటనే గుర్తుకొచ్చే మొదటి పేరు శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan). ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన శివరాజ్ సింగ్ చౌహన్‌కే తొలి ప్రాధాన్యత ఉన్నప్పటికీ... ఆయనకు పోటీగా నరోత్తం మిశ్రా (Narottam Mishra) సైతం అధిష్టానంతో లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎవరీ నరోత్తం మిశ్రా ?
నరోత్తం మిశ్రా.. గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన నరోత్తం మిశ్రా ఇటీవల కాలంలో పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పటి నుంచే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతో మంది ఎమ్మెల్యేలు తనతో నిరంతరం టచ్‌లో ఉన్నారని చెబుతూ వస్తున్నారు. అన్నింటికిమించి జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ లోంచి బీజేపిలోకి తీసుకురావడంలో తన పాత్ర కూడా ఉందని నరోత్తం మిశ్రా చెప్పుకుంటున్న తీరు చూస్తోంటే... మిశ్రా కూడా బీజేపి తరపున సీఎం రేసులో పోటీ పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Sing) సైతం నరోత్తం మిశ్రాపైనే హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో నరోత్తం మిశ్రా పేరు కూడా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహన్, నరోత్తమ్ మిశ్రా... ఈ ఇద్దరిలో బీజేపి అధిష్టానం ఎవరివైపు మొగ్గుతుందా అంటే అది ఇప్పటికైతే జవాబు దొరకని ప్రశ్నే అనేది పరిశీలకుల అభిప్రాయం. బీజేపి అధిష్టానంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం దీనిపైనే తర్జనబర్జనలు పడుతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here