Karnataka Exit Poll Result: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి పేరు గుర్తుండే ఉంటుంది. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సదరు మంత్రి గారు 2021 మార్చి 3న తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో రమేష్ జార్కిహోళికి సంబంధించిన లీకైన ఒక సెక్స్ టేప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో రమేష్ జార్కిహోళి ఒక మహిళతో ఉండటంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసేలా తీవ్ర ఒత్తిడి వచ్చింది. అలా మంత్రి గారు కాస్తా తన మంత్రి పదవి పోగొట్టుకుని మాజీ మంత్రి అయ్యారు.
తాజాగా ఈ మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి మరోసారి వార్తల్లోకెక్కారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివ కుమార్‌పై ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపి ఎమ్మెల్యే అయిన రమేష్ జార్కిహోళి సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో పాల్గొనవద్దని శివ కుమార్ బెదిరించాడని.. తన హెచ్చరికలు లెక్కచేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ సీడీలు విడుదల చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని రమేష్ జార్కిహోళి ఆరోపించారు. తాను ఆ సీడీలు విడుదల చేస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని.. నీ పరువు ప్రతిష్టలు పూర్తిగా దెబ్బతింటాయని శివకుమార్ తనని బ్లాక్ మెయిల్ చేశాడని రమేష్ జార్కిహోళి మీడియాకు వెల్లడించారు.
నేడు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గోకక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలో దిగిన రమేష్ జార్కిహోళి.. ఇంకా శివ కుమార్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. రాబోయే ముఖ్యమంత్రి, హోంమంత్రి శివకుమార్ పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరం అయితే సీబీఐ చేత విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదన్నారు. శివకుమార్ పై కఠిన చర్యలు తీసుకుంటేనే అలాంటి సీడీ గ్యాంగ్స్ బెదిరింపులకు గురవుతున్న వందలాది మందికి ఊరట లభిస్తుంది అని అన్నారు.
శివకుమార్ మళ్లీ మళ్లీ తనను బ్లాక్మెయిల్ చేస్తాడనే విషయం తనకు తెలుసు అని రమేష్ జార్కిహోళి అన్నారు. అయినా అతడి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనకు తెలుసు అనే ఉద్దేశంతోనే శివకుమార్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని రమేష్ జార్కిహోళి మండిపడ్డారు. ఎలాంటి పరిస్థితులనైనా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని రమేష్ జార్కిహోళి స్పష్టంచేశారు.