తెలంగాణ ఎన్నికలు: రాహుల్‌తో కలిసి చంద్రబాబు ప్రచారానికి ముహుర్తం ఖరారు..!

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో విరివిగా ప్రచారం చేసుకొనేందుకు మహాకూటమి నేతలు సన్నద్ధమవుతున్నారు.

Last Updated : Nov 20, 2018, 02:53 PM IST
తెలంగాణ ఎన్నికలు: రాహుల్‌తో కలిసి చంద్రబాబు ప్రచారానికి ముహుర్తం ఖరారు..!

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో విరివిగా ప్రచారం చేసుకొనేందుకు మహాకూటమి నేతలు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసేందుకు ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో ఈ ఇద్దరు నేతలూ తెలంగాణలో పర్యటించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలతో కలిసి ఈ సారి తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో భాగంగా బరిలోకి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే.

దాదాపు 13 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన తెలుగు తమ్ముళ్లు ప్రచారాలతో ఇప్పటికే భాగ్యనగరాన్ని హోరెత్తిస్తున్నారు. అలాగే రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీల నేతలకు ఇప్పటికే మహాకూటమి అధినేతలు షెడ్యూల్ కూడా పంపించడంతో ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఈ క్రమంలో రాహుల్, చంద్రబాబు పర్యటన సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. 

అలాగే... సోనియా గాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు పాల్గొంటారా? లేదా? అన్న అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార  కార్యక్రమానికి ఈ నెల 23వ తేదిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రానున్నారు. మేడ్చల్ బ‌హిరంగ స‌భ‌లో ఆమె ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటినుండే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.  ఈ నెల 23వ తేదిన సాయంత్రం  5 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్ పోర్టుకి సోనియా గాంధీ చేరుకుంటారు. అక్కడి నుండి కారులో మేడ్చల్ వెళ్తారు. తర్వాత ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోతారు. ప్రస్తుతం ఈ కార్యక్రమ ఏర్పాట్లను కాంగ్రెస్ నేత  భట్టీ విక్రమార్క మొదలైనవారు పరిశీలిస్తున్నారు.

Trending News