కోల్‌కతా: కోల్‌కతా విమానాశ్రయం నుంచి ముంబై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని పేల్చేస్తానని, అందులో ప్రయాణిస్తున్న వారిని అందరిని చంపేస్తానని ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడటం విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. సోమవారం ఉదయ 8:15 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి ముంబై బయల్దేరడానికి సిద్ధమైన విమానాన్ని తిరిగి టాక్సీలు ఆగే వైపు నిర్మానుష్యమైన ప్రాంతంలోకి మళ్లించి అక్కడే విమానంలోంచి ప్రయాణికులు అందరినీ కిందకి దించేసి విమానాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు తెలుస్తోంది.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం విమానంలో కర్చిఫ్‌తో తన ముఖాన్ని కవర్ చేసుకున్న ఓ ప్రయాణికుడు ఫోన్లో మరొకరితో మాట్లాడుతూ.. విమానాన్ని పేల్చేస్తానని చెప్పడం విన్న తోటి ప్రయాణికులు వెంటనే విమానం పైలట్, సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో విమానం పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి చేరవేసి, వారి సూచనలమేరకు విమానాన్ని విమానాశ్రయంలోనే ఓ నిర్మానుష్యమైన ప్రాంతంవైపు తీసుకెళ్లారు. అక్కడే బాంబ్ స్వ్కాడ్ బృందాలు సోదాలు నిర్వహించగా సీఆర్పీఎఫ్ బలగాలు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అధికారులు అనుమానిత వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.