పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి రావల్పిండి ప్రాంత పరిధిలోకి వచ్చే పాతకాలం నాటి గోపాలుడి గుడికి 20 మిలియన్ రూపాయలను నిధులుగా కేటాయించింది. ఈ నిధులను ఆ గుడికి మరమ్మత్తులు చేయించడానికి కేటాయించినట్లు తెలిపింది. కాగా.. రావల్పిండి, ఇస్లామాబాద్ ప్రాంతాలలో చాలా సంవత్సరాలుగా ఉన్న హిందూ దేవాలయం అదే కావడం గమనార్హం.
ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని.. కానీ తక్కువమంది భక్తులు వస్తుంటారని సమాచారం. 1897లో కంజీమాల్ అనే ఆయన ఈ గుడిని నిర్మించారని అంటున్నారు. కొన్నాళ్లు పూజాధికాలు లేకుండా ఉన్న ఈ గుడిని 1949 తర్వాత మళ్లీ తెరిచారట. 1970లో పాకిస్తాన్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గతకొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ గుడికి ప్రభుత్వ నిధులతో మరమ్మత్తులు చేయించాక.. వివిధ పండగలప్పుడు మరింతమంది హిందువులు వచ్చి పూజాధికాలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తామని స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఈ నిధులను స్థానిక ప్రొవిన్షియల్ అసెంబ్లీకి చెందిన హిందూ సభ్యుని సిఫార్సు మేరకు కేటాయించినట్లు భావిస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ గుడిలో ప్రభుత్వం మరమ్మత్తు పనులను చేయించడానికి కాంట్రాక్టర్లను పంపిస్తున్నట్లు తెలిపింది.