తమిళనాడు గుట్కా కుంభకోణానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 2016, ఆగస్టు 11న అప్పటి ఐటీ శాఖ చెన్నై ప్రిన్సిపల్ డైరెక్టర్ అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి రాసిన ఓ లేఖను పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శశికళ గది నుంచి స్వాధీనం చేసుకున్న ట్టు ఐటీ అధికారులు మద్రాస్ హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. డీఎంకే ఎమ్మెల్యే అంబజగన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందిస్తూ ప్రస్తుత ఐటీ శాఖ చెన్నై ప్రిన్సిపల్ డైరెక్టర్ సుశీ బాబు వర్గీస్ కోర్టుకి ఈ అఫిడవిట్ సమర్పించారు.
తమిళనాడులో గుట్కా అమ్మకాలు నిషేధంలో వున్నందున.. రాష్ట్రంలో తమ గుట్కా అమ్మకాలకు ఎవ్వరూ అడ్డం రాకుండా వుండేందుకు పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకి పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్టుగా ఓ గుట్కా కంపెనీలో భాగస్వామి అయిన మాధవ రావు అనే బిజినెస్‌మేన్ ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం ఈ లేఖతో జతపర్చి వున్నట్టు ఐటీ శాఖ చెన్నై ప్రిన్సిపల్ డైరెక్టర్ సుశీ బాబు వర్గీస్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఏప్రిల్ 1, 2016 నుంచి జూన్ 15, 2016 మధ్య కాలంలో ఆరోగ్య శాఖ మంత్రికి రూ.56 లక్షలు ఇచ్చానని మాధవ రావు తన వాంగ్మూలంలో అంగీకరించినట్టుగా శశికళ గదిలో లభించిన లేఖ సారాంశం వెల్లడిస్తోందని ఐటీ శాఖ తాజా అఫిడవిట్ స్పష్టంచేసింది. పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శశికళ గదిలో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న ఈ లేఖ వివరాలు తాజా అఫిడవిట్‌తో వెలుగులోకొచ్చాయి.
శశికళ గదిలో 'సీక్రెట్ లెటర్'..!