ప్రముఖ గజల్ కళాకారిణి బేగం అక్తర్ 103వ జయంతిని పురస్కరించుకొని, గూగుల్ తన డూడుల్ గుర్తును విడుదల చేసింది. సితార్ వాయిస్తున్నట్లు కనిపించే బేగం చిత్రంతో ఈ డూడుల్ కనిపిస్తుంది. అక్టోబరు, 7, 1914 తేదీన జన్మించిన బేగం అక్తర్ తొలితరం గజల్ గాయకురాలు. హిందుస్తానీ సంగీతంలో బాణీలు కట్టి గజల్స్ పాడడం ఈమె ప్రత్యేకత. సంగీత రంగానికి బేగం చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అలాగే బేగం సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. "మల్లికా ఏ గజల్" అనే పేరుతో బేగం అభిమానులు ఆమెను పిలుచుకోవడం విశేషం. లక్నోలో ఒక సాధారణ గాయనిగా ప్రారంభమైన బేగం కెరీర్ అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చి పెట్టింది. 1920 ప్రాంతంలో పలు నాటకాల్లో కూడా నటించారు బేగం. ఆ తరం జనాలకు బేగం ఆల్ ఇండియా రేడియో ద్వారా బాగా సుపరిచితురాలు. చంద్రబాయి లాంటి థియేటర్ ఆర్టిస్టుల ప్రభావం బేగం మీద ఎంతో ఉండేది. తాను కూడా సంగీత కచేరీలు చేయాలనే బలమైన ఆకాంక్షను కలిగి ఉండేవారు ఆమె. అదే ఆత్మస్థైర్యం ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చింది. 15 ఏళ్లకే తొలి గజల్ పాడిన బేగం, ఆ వయసులో సాక్షాత్తు సరోజిని నాయుడితోనే ప్రశంసలు అందుకోవడం గమనార్హం. జిగర్ మొరదాబాదీ, కైఫీ ఆజ్మీ, షకీల్ బదాయునీ లాంటి గజల్ సింగర్స్‌తో పాటు తన పేరును కూడా చరిత్రపుటల్లో లిఖింపజేసుకున్న మహా గాయని బేగం అక్తర్.