కర్ణాటక డీజీపీపై మమతా బెనర్జీ ఫైర్.. దేవెగౌడకు ఫిర్యాదు చేసిన "దీదీ"

కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనానికి గురయ్యారు

Last Updated : May 24, 2018, 06:04 PM IST
కర్ణాటక డీజీపీపై మమతా బెనర్జీ ఫైర్.. దేవెగౌడకు ఫిర్యాదు చేసిన "దీదీ"

కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనానికి గురయ్యారు. పోలీసులు వేదిక వద్దకు అతిథులను తీసుకొస్తున్నప్పుడు సరైన రీతిలో ప్రోటోకాల్ పాటించపోవడం వల్ల... బెంగాల్ సీఎం కొంతదూరం నడవాల్సి వచ్చింది.

దీంతో ఆమె కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నీలమణి రాజుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే వేదిక వద్దకు చేరాక అక్కడున్న మిగతా అతిధులతో పాటు జేడీఎస్ నేత హెచ్ డి దేవెగౌడకు ఫిర్యాదు చేశారు.అతిథులకు మర్యాద చేసే పద్ధతి ఇదేనా? అని మండిపడ్డారు. అయితే దేవెగౌడతో పాటు కుమారస్వామి కూడా వచ్చి ఆమెకు సర్దిచెప్పడంతో ఆమె శాంతించారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కర్ణాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అలాగే కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్, బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారామ్ ఏచూరి, సోషలిస్టు నేత శరద్ యాదవ్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. 

Trending News