రూ.45 కోట్లు.. ట్రంకుపెట్టెకి దాసోహం

  

Last Updated : Nov 9, 2017, 08:43 PM IST
రూ.45 కోట్లు.. ట్రంకుపెట్టెకి దాసోహం

నోట్ల రద్దు సమయంలో చెన్నైకి సంబంధించిన దండపాణి అనే వ్యాపారి ఇంటి నుండి దాదాపు 45 కోట్ల రూపాయల విలువ చేసే 500, 1000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదాయానికి సంబంధించి సరైన లెక్కలు ఆయన చూపలేకపోవడంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ తర్వాత సీజ్ చేసిన సొమ్ము విషయాన్ని ఆదాయ పన్ను శాఖతో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వారికి కూడా తెలియజేశారు.

అయితే వారు స్పందించపోవడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఆర్బీఐ నుండి స్పందన వచ్చేవరకూ ఆ డబ్బును పోలీసు స్టేషనులోనే ఉంచాల్సిందిగా కోర్టు తీర్పు చెప్పింది. కనుక, ఇక చేసేదేమీ లేక, స్టేషనులో ఓ చోట ఆ డబ్బు సంచి పెట్టి, దానిని కాపుగాసారు పోలీసులు. ఆ తర్వాత ట్రంకుపెట్టెలో అవే 45 కోట్ల రూపాయలు సర్ది ఇటీవలే ఆ డబ్బును కోడంబాకం పోలీసు స్టేషనుకి తరలించారు.

అయితే చెల్లని నోట్లు పదికంటే ఎక్కువ ఉంటే శిక్షార్హమని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించడంతో.. ఆ నోట్లను ఎలా వదిలించుకోవాలా అన్ని మీమాంసలో పడ్డారు పోలీసులు.  వాటి విషయమై ఎలాంటి నిర్ణయమైనా ఆర్బీఐ వారే తీసుకోవాల్సి ఉన్నందున.. ఇక మౌనంగా ఉండడమే మంచిదని గప్ చుప్పైపోయారు వారు. ఇలాంటి కేసులే అన్నానగర్, కోయంబేడు పోలీసు  స్టేషన్లలో కూడా నమోదు అయ్యాయి.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రావడం.. పోలీసులు వెళ్లడం.. డబ్బును పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం.. మళ్లీ ఆర్బీఐకి తెలియజేయడం. వారు ఏ విషయమూ చెప్పకుండా కాలయాపన చేయడంతో.. ఈ పనికిరాని నోట్ల తాకిడి పోలీస్ స్టేషన్లలో పెరిగిపోతోందని వినికిడి. 

Trending News