చేతబడి అనేది ఒక మంత్రశక్తి అని.. మనుషుల గోర్లు, జుట్టు సేకరించి ఈ మంత్రప్రయోగం చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపుతారని ఓ విధానం బాగా ప్రచారంలో ఉంది. అయితే మంత్రతంత్రాలు అనేవి లేవని.. వాటి పేరుతో ప్రజలను మోసం చేయడమే కొందరు మోసగాళ్లు పనిగా పెట్టుకున్నారని అంటారు చాలా మంది హేతువాదులు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మకూడదని కూడా కొందరు అంటారు. ఈ క్రమంలో అసలు చేతబడి అంటే ఏమిటో.. దాని వెనుక ఉన్న నిజ నిజాలేమిటో మనం కూడా తెలుసుకుందాం
*చేతబడి అంటే ఇంగ్లీషులో విచ్ క్రాఫ్ట్ అని అర్థం. దీనినే వివిధ ప్రాంతాల్లో బాణామతి అని, చిల్లంగి అని కూడా అంటారు.
*చేతబడి అనేది ఓ మంత్రవిద్య అని.. శత్రువుల పై ప్రయోగించడానికి పూర్వం దీనిని ఉపయోగించేవారని పలు గ్రంథాలు చెబుతున్నాయి.
*కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా అంతుచిక్కని అనారోగ్యం బారిన పడితే దానికి కారణం చేతబడే అని నమ్ముతారు. దాని నివారణ కోసం మంత్రగాళ్లను సంప్రదిస్తారు.
*చేతబడి చేయడంలో భాగంగా ఓ మనిషి బొమ్మను తయారుచేస్తారు. దానిని మంత్రించిన సూదులతో గుచ్చుతారు. అలా చేయడం ద్వారా అదే బాధ చేతబడి ప్రయోగించబడిన వ్యక్తికి కలుగుతుందని మంత్రగాళ్ల నమ్మకం
*చేతబడి విధానంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ లాంటి వారు కూడా మాట్లాడారు. అసలు అన్నిటికన్నా హీనమైన చేతబడి జనాల మనసులో జరిగేదే అని ఆయన చెబుతారు. దాంతో పోలిస్తే ఎదుటివాళ్ళు చెయ్యగలిగేది చాలా అత్యల్పం అని.. మనసే భయం, ఆందోళన అనే చేతబడికి నిలయంగా మారిపోతే మటుకు, ఎదుటివాళ్ళు దాన్ని కొద్దిగా రగిలించినా అది మిమ్మల్ని ధ్వంసం చేసెయ్యగలుగుతుందనేది ఆయన భావన.
*చేతబడి అనేది ఓ మూఢనమ్మకమని.. దాని పేరుతో కొన్ని గ్రామాల్లో పేద మహిళల పట్ల జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కావని చెబుతూ ప్రవీణ్ శర్మ అనే రచయిత "మంత్రగత్తెల వేట" అనే పుస్తకం కూడా రాశారు.
*చేతబడి పేరుతో మంత్రగాళ్లమని చెప్పుకొనే వారు జనాలను మానసికంగా కుంగదీస్తారని.. వారిని భయభ్రాంతులకు గురిచేసి.. ఉన్నది లేనిది లేనిది ఉన్నట్లు చెబుతారని పలువురు మానసిక వైద్యులు అనడం గమనార్హం.
*చేతబడి లాంటి విషయాలపై ప్రముఖ హేతువాది ఇన్నయ్య కూడా తన అభిప్రాయాలను పలు గ్రంథాలలో తెలిపారు.
"మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనే ఉన్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది.ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.
ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారు" అని ఇన్నయ్య తెలిపారు.