వినయ విధేయ రామ మూవీ రివ్యూ

'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమా ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ చిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

Last Updated : Jan 11, 2019, 04:23 PM IST
వినయ విధేయ రామ మూవీ రివ్యూ

నటీనటులు : రామ్ చరణ్ , కియార అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, రవి వర్మ తదితరులు.
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణం : డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : దానయ్య
రచన -దర్శకత్వం : బోయపాటి శ్రీను
విడుదల తేది : 11 జనవరి 2019
'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమా ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ చిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన వినయ విధేయ రామ ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. మరి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :
వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవించే ఓ నలుగురు అనాథ పిల్లలకు ప్రాణాపాయంలో ఉన్న ఓ పసిగుడ్డు దొరుకుతాడు. ఆ ఐదుగురు పిల్లలను చేరదీసిన ఓ డాక్టర్(చలపతి రావు) వారికి ఆశ్రయమిస్తాడు. అలా ఆ నలుగురికి దొరికిన చిన్న పిల్లాడే కొణిదెల రామ్(రామ్ చరణ్). పెద్దవాడు భువన్ కుమార్ (ప్రశాంత్) బీహార్‌లో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ రాజా భాయ్ అక్రమాలకు అడ్డం తిరుగుతాడు. తన నిజాయితితో తనకి అడ్డుగు నిలిచిన భువన్ కుమార్‌ని రాజా భాయ్ చంపేస్తాడు. దాంతో రామ్ కొణిదెల రాజుభాయ్‌ను చంపేసి ఫ్యామిలీని దూరంగా తీసుకెళ్లి నలుగురు వదినలు ముగ్గురు అన్నయ్యలతో మాములు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా చనిపోయాడనుకున్న రాజు భాయ్ బతికొస్తాడు. అయితే రాజు భాయ్ బతికే ఉన్నాడని తెలిసిన రామ్ కొణిదెల మళ్ళి వేట మొదలెడతాడు. చివరికి రాజు భాయ్‌ని ఎలా చంపాడు అనేది ‘వినయ విధేయ రామ’ కథ.

నటీనటుల పనితీరు :
రంగస్థలం సినిమాతో నటుడిగా పది మెట్లెక్కిన రామ్ చరణ్ ఈ సినిమాలో దర్శకుడు చెప్పింది చేసి పరవాలేదనిపించుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్‌లో చరణ్ నటన బాగుంది. కియరా తన గ్లామర్‌తో ఎట్రాక్ట్ చేసింది. కానీ క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో కొన్ని సీన్స్‌కే పరిమితం అయ్యింది. ఇక ఒకప్పటి హీరో ప్రశాంత్ IAS ఆఫీసర్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ అతని క్యారెక్టర్‌కి సంబంధించిన ఎమోషన్ పండలేదు. ఆర్యన్ రాజేష్ రోల్‌కి నటించే స్కోప్ లేదు. కేవలం మధునందన్, రవి వర్మలతో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నాడంతే. స్నేహ వదిన పాత్రలో ఒదిగిపోయింది. ఈషా గుప్తా ఒక స్పెషల్ సాంగ్ రెండు సన్నివేశాలకే పరిమితమైంది. సినిమాలో ఆమె నటన బాగుంది. సినిమాలో కాస్తో కూస్తో నవ్వించింది హేమ ఒక్కరే. ఆమె నటించిన పెళ్లి చూపులు సీన్ ప్రేక్షకులను నవ్వించింది.

ఇక పవర్‌ఫుల్ విలన్‌గా వివేక్ ఒబెరాయ్ మెప్పించలేకపోయాడు. నటుడిగా బాగానే పర్‌ఫామ్ చేసినప్పటికీ విలనిజం పెద్దగా కనిపించలేదు. ఇక ముకేష్ రుషి, పృథ్వి, మహేష్ ,హిమజ తదితరులు తమ క్యారెక్టర్స్‌తో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకు తగిన మ్యూజిక్ అందించే దేవి శ్రీ ప్రసాద్ ఈసారి మాత్రం తన మేజిక్ చూపించలేకపోయాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలకు దేవి సాఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తందానే తందానే, తస్సాదియ్యా పాటలు జస్ట్ పరవాలేదు అనిపిస్తాయి. రిషి, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా అజర్భైజన్ ఎపిసోడ్‌లో సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది. కొరియోగ్రఫీ పరవాలేదు. ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషి చేసే స్టెప్స్ పెద్దగా కంపోజ్ చేయలేకపోయారు కొరియోగ్రాఫర్స్. ఎడిటింగ్ పరవాలేదు.

బోయపాటి సినిమాలో ఉండే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈసారి పెద్దగా వినిపించలేదు. ట్రైలర్‌లో ఉన్న రెండు మూడు డైలాగ్సే సినిమాలో వినిపించాయి. బోయపాటి డైరెక్షన్ బాగున్నా కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్‌గా తెరకెక్కించాడు. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

రామ్‌చరణ్ నుంచి నికార్సయిన మాస్ మూవీ వచ్చి చాన్నాళ్లయింది. మెగాహీరో నుంచి మాస్ సినిమాను కోరుకుంటున్న ప్రేక్షకులకు బోయపాటి లాంటి మాస్ డైరక్టర్ తోడైతే ఎలా ఉంటుందో ఊహించడం కొంచెం కష్టమే. సరిగ్గా అలానే ఉంది వినయ విధేయ రామ సినిమా. ఓపెనింగ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అంతా మాస్, ఓన్లీ యాక్షన్. సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించడు, అతడి స్టైల్ కనిపించదు. ఓన్లీ బోయపాటి హీరో, అతడి యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అంతలా సినిమాను మాస్-యాక్షన్ ఎలిమెంట్స్‌తో నింపేశాడు దర్శకుడు.

బోయపాటి డైరెక్షన్‌లో కొన్నేళ్లుగా మెగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న యాక్షన్ సినిమా అయితే వచ్చేసింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ కాంబినేషన్ మీదున్న ఆసక్తి బోయపాటి కథలో కనిపించలేదు. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడికి కథేంటో, ఏం జరగబోతుందో అర్థం అయిపోతుంది. నిజానికి ఇక్కడే సినిమా బోల్తా కొట్టింది. సినిమా ఎలా స్టార్ట్ చేసినా కథలో ప్రేక్షకుడు ఊహించని ఏదో ఒక ఎలిమెంట్ లేదా ట్విస్ట్ పడాలి. అయితే ఈసారి ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టి కథని లైట్ తీసుకున్నాడు బోయపాటి. అవుట్-డేటెడ్ కథతో ఈ సినిమా తీసిన బోయపాటి అందులో సరైన మసాలా(ఎమోషన్)ను కలపలేకపోయాడు. మరీ ముఖ్యంగా జర్కీ స్క్రీన్ ప్లే కారణంగా కథ ఏ సందర్భంలో ఏ లొకేషన్‌లో జరుగుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. వైజాగ్, ద్వారక, హైదరాబాద్ అంటూ కన్ఫ్యూజ్ చేసి పడేశారు.

ఫ్యామిలీ అంటే వారి మధ్య ఉండే బాండింగ్ మాత్రమే చూపిస్తే సరిపోతుందా..? వారి మధ్య ఎంత ప్రేమ ఉంది.. అది ఎంత దృడంగా మారింది..? అనే అంశాలను హైలైట్ చేస్తూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు రాసుకోవాలి. సరిగ్గా వినయ విధేయ రామలో ఇదే మిస్ అయ్యింది. అన్నదమ్ముల మధ్య సరైన ఎమోషన్ పండలేదు. ముఖ్యంగా  ప్రశాంత్ చనిపోయే సన్నివేశం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, చరణ్ ల మధ్య  ఎమోషనల్ సీన్స్ పెద్దగా లేకపోవడం ప్రేక్షకులను డిస్సపాయింట్ చేస్తుంది.

రామ్ చరణ్‌తో మాస్ ఆడియన్స్‌ని మెప్పించాలని బోయపాటి పడిన తాపత్రయమే ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌పై బోయపాటి శ్రద్ధ పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక ప్రతిసారి తన యాక్షన్ ఎపిసోడ్స్‌తో థియేటర్స్‌లో అరుపులు పుట్టించే బోయపాటి, ఈసారి యాక్షన్‌లో పీక్స్ చూపించాలనే లక్ష్యంతో మరీ అతిచేశాడు. కత్తితో నరికితే తలకాయలు ఎగరడం, వాటిని రాబందులు నోటితో కరుచుకొని వెళ్లడం లాంటి సన్నివేశాలు వెగటు పుట్టిస్తాయి తప్ప చప్పట్లు కొట్టించవు.

ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి సిసలైన మాస్ సినిమా మాత్రం ఇదే. సి-సెంటర్ ఆడియన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌కు ఇది ఓ మోస్తరుగా నచ్చే ఛాన్స్ ఉంది.

రేటింగ్ : 2.5 /5

Trending News