తెలుగు సాహిత్యంలో ఎన్నో గొప్ప రచనలు మనకు అందుబాటులో ఉన్నాయి. భాషా వికాసాన్ని పెంపొందించడంతో పాటు సాహిత్యం పట్ల అనురక్తిని, ఆసక్తిని పెంపొందించే రచనలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాంటి కొన్ని మంచి రచనల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
ఆంధ్రుల సాంఘిక చరిత్ర - ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు పరిశోధన చేసి వివిధ చరిత్రలను ఆధారంగా చేసుకుని రచించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ భాషలకు ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంథానికే ఇవ్వడం జరిగింది. ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి ఈ గ్రంథంలో చోటు కల్పించడం జరిగింది. అనేక భారతీయ భాషలలోకి ఈ గ్రంథం అనువాదమైంది.
వేమన పద్యాలు - తెలుగు పద్యాలతో తెలుగు ప్రజలకు నీతిపాఠాలు చెప్పిన వేమన పద్యాలు... చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వెలుగులోకి రావడం విశేషం. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము రాసిన ఘనత వేమనకే దక్కింది. నిర్భయంగా నిస్సంకోచంగా, నిజాయితీగా రాజీలేని పోరాటం చేసిన కవి యోధుడిగా వేమనను అనేకమంది కీర్తిస్తారు. లోతైన భావాలను సైతం చాలా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో చెప్పడం కేవలం వేమనకే చెల్లింది.
సాక్షి వ్యాసాలు - సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. పానుగంటి లక్ష్మీనరసింహారావు ఈ వ్యాసాలను రాశారు. చిక్కనైన గ్రాంధిక భాషలో ఈ వ్యాసాలను రాయడం జరిగింది. సామాజిక చైతన్య ప్రబోధం కోసం ప్రజలకు జీవిత విలువలు చెప్పడానికి రాసిన ఈ వ్యాసాల్లో కాలాచార్యుడు, జంఘాల శాస్త్రి, వాణీదాసుడు, కోమటి, సాక్షి అనే పాత్రల సహాయంతో ఈ వ్యాసాల్లో అనేక విషయాలను రచయిత చర్చిస్తారు.
మహా ప్రస్థానం -మహాకవి శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వమనే కవితావిప్లవానికి నాంది పలికిన రచన మహా ప్రస్థానమని అంటూ ఉంటారు. మహాప్రస్థానం గేయాల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా మానవజాతి ఎదుర్కొంటున్న కష్టాలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి ఉండాల్సిన లక్షణాల గురించి చర్చించడం జరిగింది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి" అని ఈ పుస్తక పీఠికలో తెలపడం గమనార్హం.
విశ్వంభర - మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులని తెలిపిన ఈ పద్యకావ్యానికి 1988లో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సి.నారాయణరెడ్డి కలం నుండి జాలువారిన ఈ రచనలో ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలనే ప్రకరణాలుగా రూపొందించడం జరిగింది.
అసమర్థుని జీవయాత్ర - తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల "అసమర్థుని జీవయాత్ర". ఫ్రాయిడ్, ఆడ్లర్ సిద్ధాంతాల ప్రభావంతో వచ్చిన ఈ నవలలోని పాత్రలలో ఆధిక్యత ధోరణితో పాటు ఆత్మన్యూనతా భావాలు కూడా కనిపిస్తాయి. మానవ మనుగడలోని కీలకాంశాలను రచయిత చాలా ఒడుపుగా ఈ నవలలో మనకు విశదీకరించడానికి ప్రయత్నిస్తారు. ఫ్యూడల్ పెట్టుబడిదారి వ్యవస్థల సంధికాలంలో మనుషుల జీవిత చిత్రణ ఈ నవలలో ప్రస్ఫుటితంగా కనిపిస్తుంది.
అమృతం కురిసిన రాత్రి - ఆధునిక వచన కవిత్వంలో అందరూ గుర్తుపెట్టుకోదగ్గ గొప్ప ఖండికగా సుందర సుమధుర రసగుళికల సమాహారాన్ని అందించిన కవితా సంపుటే "అమృతం కురిసిన రాత్రి". దేవరకొండ బాలగంగాధర తిలక్ కలం నుండి జాలువారిన ఈ రచన 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఉత్తమ కవితా సంకలనంగా పేరొందింది.
కన్యాశుల్కం - తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందిన నాటకం "కన్యాశుల్కం". తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ, మనుషుల శ్వాస నిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించిన మొదటి సాంఘిక నాటకం "కన్యాశుల్కం". సాంఘిక దురాచారాలను ఎండగడుతూ.. మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసిన నాటకం "కన్యాశుల్కం".
బారిష్టరు పార్వతీశం - తెలుగు నాట హాస్య రచనలకు పెద్దపీట వేసిన రచన "బారిష్టరు పార్వతీశం". మొక్కపాటి నరసింహశాస్త్రి కలం నుండి జాలువారిన ఈ నవలలో ఆంధ్రావనికి చెందిన ఓ అమాయక చక్రవర్తి లండన్ వెళ్లి న్యాయశాస్త్రం అభ్యసించడానికి ఎన్ని తంటాలు పడ్డాడో తెలియజేస్తుంది. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా గుర్తుపెట్టుకోదగ్గ హాస్యనవల "బారిష్టరు పార్వతీశం" అనడంలో అతిశయోక్తి లేదు.
ఎంకి పాటలు - ప్రణయ భావుకతకు, పదాల పొందికకు కొత్త అందాన్ని తీసుకొచ్చిన రచన నండూరి సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన "ఎంకి పాటలు" అని చెప్పవచ్చు. తొలివలపులు, విరహ వేదనలు ఈ పాటల్లో ప్రధానంగా కనిపిస్తాయి. వ్యావహారిక భాష బహుళంగా రచనలలో వాడకముందే పల్లె ప్రేమికుల గురించి ఎంకి పాటలు రాసిన ఘనత నండూరి వారిది.