ఇటీవల రిలీజైన గీత గోవిందం సినిమా కలెక్షన్స్ పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి టాలీవుడ్లో మరో రికార్డ్ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.53 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో గీత గోవిందం ముందు వరుసలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా నటుడు విజయ్ దేవరకొండకు ఈ సినిమా మరిచిపోలేని విజయాన్ని అందించింది. ఇప్పటికే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గీత గోవిందం ఇచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అన్నింటికిమించి దర్శకుడు పరశురామ్‌కి శ్రీరస్తు శుభమస్తు లాంటి డిజాష్టర్ తర్వాత కెరీర్లోనే అద్భుతమైన విజయాన్ని అందించింది ఈ చిత్రం.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గీత గోవిందం సినిమాపై తాజాగా కాపీ ఆరోపణలు రావడం సినీవర్గాల్లో చర్చనియాంశమైంది. అది కూడా వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు చేసిన ఆరోపణలు కావడంతో గీత గోవిందం సినిమా నిజంగా కాపీ కొట్టిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును, శతాధిత చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు ఇటీవల ఓ అవార్డ్స్ షోలో మాట్లాడుతూ... "20 ఏళ్ల క్రితం తాను తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాను చూసి గీత గోవిందం కాపీ కొట్టారు'' అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అప్పట్లో తాను డైరెక్ట్ చేసిన ఆ సినిమాను అల్లు అరవింద్ నిర్మించినట్టు రాఘవేంద్ర రావు గుర్తుచేసుకున్నారు. అయితే, రాఘవేంద్ర రావు ఈ విషయాన్ని వివాదాస్పదం చేయకుండా గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌కి కంగ్రాట్స్ చెప్పడంతో వివాదం అంతటితో సద్దుమణిగిందనే టాక్ వినిపిస్తోంది.
విచిత్రం ఏంటంటే.. రాఘవేంద్ర రావు చెప్పినట్టుగా అప్పట్లో పెళ్లి సందడి సినిమాను నిర్మించిన అదే అల్లు అరవింద్ మళ్లీ ఈ గీత గోవిందం సినిమాను సమర్పించడం ఏంటని కొందరు సినీ ప్రముఖులు చెవులు కొరుక్కుంటున్నారు.