HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?

HIT 2 Movie Review అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ సెకండ్ కేస్ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. విలన్ ఎవరు? అసలు కథ ఏంటి? అన్నది తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 11:43 AM IST
  • థియేటర్లో హిట్ 2 సందడి
  • హిట్ కొట్టేసిన నాని
  • అదరగొట్టేసిన అడివి శేష్
HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?

HIT 2 Movie Movie Review నాని నిర్మాతగా తన టేస్ట్‌ను ఎప్పటికప్పుడు జనాల ముందుకు కొత్త చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే నాని నిర్మించిన హిట్ ఫస్ట్ కేస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ అంటూ వచ్చేశారు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించాడు. టీజర్ ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆసక్తిని పెంచేయడంతో సినిమా మీద మరింత బజ్‌గా ఏర్పడింది. మరి ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు థ్రిల్ చేస్తుందో చూడాలి.

కథ
వైజాగ్‌ ఎస్పీ కృష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్‌)  కూల్ కేస్‌ను సాల్వ్ చేస్తుంటాడు. ఎక్కువగా రియాక్ట్ అవ్వడు. అన్నింటినీ లైట్ తీసుకుంటాడు. ఆర్యా (మీనాక్షి చౌదరి) చేనేత కార్మికులు, మహిళా సంఘాలు అంటూ తిరుగుతుంటుంది. ఆర్యా, కేడీలు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. అలా సాఫీగా సాగడుతున్న కేడీ జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంట్రీ ఇస్తాడు. నగరంలో సంజన అనే అమ్మాయి అతి కిరాతకంగా హత్యకు గురవుతుంది. అయితే తల మాత్రమే సంజనది అని.. మిగతా బాడీ పార్టులన్నీ వేరే వేరే అమ్మాయిలవని తేలుతుంది. ఇక ఈ కేసును చేధించేందుకు కేడీ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో రామ్ దాస్ (హర్ష వర్దన్) గురించి తెలుసుకున్నది ఏంటి? కుమార్ (సుహాస్‌) పాత్ర ఏంటి? సీరియల్ కిల్లర్ కన్ను ఆర్యా మీద ఎందుకు పడుతుంది? ఆర్యాను చివరకు కేడీ కాపాడుకుంటాడా? అనేది కథ.

నటీనటులు
ఎస్పీ కేడీ పాత్రలో అడివి శేష్‌ తన యాటిట్యూడ్, ఇంటెలిజెన్స్‌ను మొదటి సీన్లో చూపించేస్తాడు అడివి శేష్. కేడీగా అడివి శేష్ అద్భుతంగా నటించాడు. కాస్త వెటకారం, డ్యూటీలో సిన్సియారిటీ, ప్రేమించిన అమ్మాయి పట్ల కేరింగ్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అడివి శేష్ మెప్పిస్తాడు. ఇక మీనాక్షి చౌదరి ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. వర్షగా కోమలి ప్రసాద్ సినిమా చివరి వరకు మెప్పిస్తుంది. రావు రమేష్ సీన్లు కూడా బాగానే మెప్పిస్తాయి. సుహాస్, హర్ష వర్దన్, మాగంటి శ్రీనాథ్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్, తణికెళ్ల భరణి ఇలా అందరూ చక్కగా నటించారు.

విశ్లేషణ
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో కిక్కు పదే పదే కనిపించదు. సినిమాను మొదటి సారి చూసినప్పుడే ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయిన తరువాత సినిమా మీద అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు. సైకో థ్రిల్లర్, సస్పెన్స్ మూవీలతో వచ్చిన చిక్కే అది. అయితే సినిమాను తెరకెక్కించిన విధానం, నడిపించిన స్క్రీన్ ప్లేతో సినిమాను బోరింగ్‌గా కాకుండా ఇంట్రెస్టింగ్‌గా మలచొచ్చు. శైలేష్ కొలను హిట్ ఫస్ట్ కేస్‌కు ఇదే చేశాడు.

మొదటి పార్ట్ కాస్త స్లోగా అనిపించినా ఇచ్చిన డీటైలింగ్, ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు, చూపించిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. ఈ సెకండ్ కేస్‌లోనూ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. ప్రథమార్థం అలా మెల్లిగా సాగినట్టు అనిపిస్తుంది. ప్రథమార్థంలో కేసు తప్పుదోవ పడుతోందని సాధారణ ప్రేక్షకుడు సైతం అంచనా వేస్తాడు. ఇక ఇంటర్వెల్ సీన్‌ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించదు.

ఎప్పుడైతే కథనం సెకండాఫ్‌కు షిప్ట్ అవుతుందో.. సినిమా పరుగులు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. కిల్లర్ గురించి తెలుసుకునే సీన్లు బాగానే అనిపిస్తాయి. అయితే ఇలాంటి సినిమాల్లో ఒకటే మైనస్. ముందు మంచివాడిలా చూపించే వాడిని.. చివరకు విలన్‌గా చూపిస్తారు. ఇది అందరూ వాడేస్తోన్న ఫార్మూలానే. ఇందులోనే అదే వాడారు. ఇక్కడ ఆ ట్విస్ట్ ఏంటో చెప్పేస్తే.. ప్రేక్షకులు థ్రిల్ మిస్ అవుతారని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఆ కోడి బుర్ర ఎవరిదో స్వయంగా థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుంది.

మొత్తానికి క్లైమాక్స్ మాత్రం బాగా క్లిక్ అవుతుంది. అడివి శేష్‌లోని ఇంకో కోణం కనిపిస్తుంది. యాక్షన్‌లో అడివి శేష్ మెప్పిస్తాడు. ఈ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా నేపథ్య సంగీతం సాగింది. కెమెరా పనితనం కూడా సినిమా మూడ్‌ను అలానే కంటిన్యూ చేయించింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి.

థర్డ్ కేస్ అంటూ అర్జున్ సర్కార్ (నాని)ను శైలేష్‌ కొలను రంగంలోకి దించబోతోన్నాడు. మరి అందులో నాని ఎలాంటి కేస్‌ను సాల్వ్ చేస్తాడో.. అందులో ఎలాంటి ట్విస్టులుంటాయో చూడాలి.

రేటింగ్ : 3

బాటమ్ లైన్‌ : హిట్ 2.. మళ్లీ వర్కౌట్ అయిన శైలేష్ కొలను శైలి

Also Read : Matti Kusthi Telugu Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. సరదాగా సాగే భార్యాభర్తల పోటీ

Also Read : HIT 2 Twitter Review : హిట్‌ 2 ట్విట్టర్ రివ్యూ.. కచ్చితంగా హిట్టే.. ట్విస్ట్ రివీల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News