RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?

RBI Guidelines About Rs 2000 Notes: రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. బ్యాంకుల నుంచి ఆ నోట్లను మార్చుకునేందుకు జనానికి దాదాపు 100 రోజుల సమయం ఇచ్చింది. ఈ 100 రోజుల్లో బ్యాంకుల నుండి జనం సుమారు రూ. 20 లక్షల వరకు మార్చుకునే వెసులుబాటు ఉంది. కానీ ఒకవేళ మీ వద్ద అంతకంటే ఎక్కువ మొత్తంలో రూ. 2 వేల నోట్లు ఉంటే ఏం చేయాలి ? ఎలా మార్చుకోవాలి ?

Written by - Pavan | Last Updated : May 20, 2023, 09:40 PM IST
RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?

RBI Guidelines About Rs 2000 Notes: రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయ్యింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకుల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవాల్సిందిగా ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది. ఎవ్వరైనా ఒక్క రోజుకు బ్యాంకు నుండి రూ. 20,000 వరకు.. అంటే 10 నోట్లు వరకు మార్చుకునే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ఎక్కువ మొత్తంలో రూ. 2 వేల నోట్లు ఉంటే ఏం చేయాలనేదే 2 వేల నోట్లు దాచుకున్న చాలామంది బడా బాబుల ముందున్న సవాల్. 

ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు జనం తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు.. లేదంటే మార్చుకోవచ్చు. అంటే మొత్తం 131 రోజులు అవకాశం ఉంది. అయితే, ఈ నాలుగు నెలల కాలంలో వీకెండ్ హాలీడేస్ కలిపి 26 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. ఇవేకాకుండా.. బక్రీద్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వంటి ప్రత్యేకమైన సందర్భాలు కలుపుకుని దేశవ్యాప్తంగా మరో 5 రోజుల బ్యాంకు సెలవులు రాబోతున్నాయి. ఆ ప్రకారం చూస్తే.. 131 రోజుల్లో కాస్త అటు ఇటుగా 30 లేదా 31 రోజుల వరకు సెలవులు పోగా మిగిలింది 100 రోజులే.

ఎవరైనా ఒక వ్యక్తి తన వద్ద ఉన్న 2000 రూపాయల నోటును మార్చుకోవడానికి 100 రోజుల పాటు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లినా.. రోజుకు 20,000 రూపాయల పరిమితి చొప్పున 100 రోజుల్లో దాదాపు 20 లక్షల రూపాయలు వరకు మార్చుకునే అవకాశం ఉంది. మరి అంతకంటే ఎక్కువ మొత్తంలో రూ. 2 వేల నోట్లు మార్చాల్సి వస్తే... ?

రూ.20 లక్షల కంటే ఎక్కువ నోట్లు ఉంటే ఏం చేయాలి ?
ఆర్బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం, డబ్బులు మార్చుకోవడానికి రోజుకు రూ. 20 వేల వరకు మాత్రమే అనే లిమిట్ ఉంది కానీ ఒకవేళ 2 వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే ఎలాంటి పరిమితి లేదు. రోజుకు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ లీగల్ గా ఒక చిక్కొచ్చి పడే ప్రమాదం ఉంది. అదేంటంటే.. ఎక్కువ మొత్తంలో ఒకరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయంటే.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. 

ఒకవేళ సెప్టెంబర్ 30వ తేదీలోగా రూ 2000 నోట్లు డిపాజిట్ చేయకపోతే...?
రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుకు వెళ్లి 2 వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడానికి వీలుంది. ఒకవేళ, సెప్టెంబరు 30 లోపు ఆ పని చేయలేకపోతే ? ఆ తరువాత ఆ నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకుల్లో కాకుండా ఆర్బీఐ రీజినల్ ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది.

Trending News