తీరాన్ని తాకిన ఫొని తుపాన్.. చిగురుటాకులా వణికిన తీరం !

ఈదురు గాలులు, భారీ వర్షాలతో తీరాన్ని తాకిన ఫొని తుపాన్ !

Last Updated : May 3, 2019, 09:54 AM IST
తీరాన్ని తాకిన ఫొని తుపాన్.. చిగురుటాకులా వణికిన తీరం !

పూరి: గత వారం, పదిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను తీవ్రంగా వణికించిన ఫొని తుపాన్ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిషాలోని పూరి జిల్లా వద్ద తీరాన్ని తాకింది. తుపాన్ ప్రభావంతో ఒడిషాలోని పారదీప్, గంజాం జిల్లా గోపాల్‌పూర్ వంటి తీర ప్రాంతంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, పశ్చిమబెంగాల్‌లోని హల్దియా, ఫ్రేజర్‌గంజ్, కోల్‌కతా, తమిళనాడులోని చెన్నై వంటి తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, కళింగపట్నం, భీమునిపట్నం తీర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాన్ తీరాన్ని దాటే ప్రభావం నేటి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుండవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ తీరం దాటేది ఒడిషాలోని పూరి జిల్లాలోనే అయినప్పటికీ.. ఆంధ్రా తీరానికి సమీపం నుంచి ఒడిషా వైపు కదలడంతో ఆంధ్రా తీరంపై సైతం తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, నేవి బృందాలు తీర ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సహాయచర్యలు చేపడుతున్నాయి.

 

Trending News