హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలాది మంది ఓటర్లు మిమ్మల్ని నమ్మి, మీకు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. మీరు సిగ్గు విడిచి పార్టీలు మారుతారా అని ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి నారాయణ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణలో ఇకనైనా ఎమ్మెల్యేల కొనుగోలుకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్చుకోవాలని సీపీఐ నారాయణ హితవు పలికారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నేడు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టగా ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నారాయణ పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ నారాయణ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కంటే జగన్ చిన్నోడని.. కానీ ఫిరాయింపుల విషయంలో కేసీఆరే జగన్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ సూచించారు. అంతేకాకుండా జగన్ కాళ్ల కింద నుంచి వంద సార్లు దూరినా కేసీఆర్‌కు బుద్ధిరాదని నారాయణ వ్యాఖ్యానించారు. నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.
ఆ విషయంలో జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి: నారాయణ చురకలు