APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

YS Sharmila AP Entry: తెలంగాణ రాజకీయాలను వదిలేసి సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన వైఎస్‌ షర్మిలకు తొలిరోజే అవమానం ఎదురైంది. ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు విజయవాడలో అడుగుపెట్టగా పోలీసులు అడ్డగించారు. అడుగడుగునా ఆంక్షలు విధించి షర్మిల వాహనాల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దా? అని ప్రశ్నించారు. పోలీసుల అడ్డగింతపై కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 01:22 PM IST
APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

Wishes to YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలి (ఏపీసీసీ)గా బాధ్యతలు చేపట్టేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న షర్మిల అక్కడి నుంచి విజయవాడలోని ఆహ్వానం ఫంక్షన్ హాల్‌ వరకు ఊరేగింపుగా వెళ్లాలని కార్యక్రమం రూపొందించారు. ర్యాలీ నిర్వహించుకోవడానికి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి విజయావాడ పట్టణం గుండా పెద్ద ఎత్తున వాహనాలతో షర్మిల ర్యాలీ చేపట్టారు. అయితే అకస్మాత్తుగా పోలీసులు అడ్డగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుకున్న ప్రకారం ర్యాలీగా వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు పోలీసులకు నచ్చజెప్పారు. 

కానీ పోలీసులు వినకుండా ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీని విజయవాడ పోలీసులు అడ్డుకుని వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్లకుండా చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాన్వాయ్‌లోంచే షర్మిల పోలీసులతో మాట్లాడారు. ఇదేమైనా భారత్‌- పాకిస్థాన్ సరిహద్దా? అంటూ నిలదీశారు. తాళ్లను ఎత్తేసి తమ కార్యకర్తలకు అనుమతించాలని కోరారు. తమ పని ప్రశాంతంగా చేసుకునేందుకు సహకరించాలని విజ్ణప్తి చేశారు.
 

అయినా కూడా వినకుండా పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షోను అడ్డుకున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై కార్యకర్తలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా షర్మిల వెంట ఆమె రాజకీయ గురువుగా వైఎస్సార్‌ ఆత్మగా పిలిచే కేవీపీ రామచంద్రరావు, మరో సీనియర్‌ నాయకుడు ఎన్‌.రఘువీరారెడ్డి ఉన్నారు. కొద్దిసేపు ఆందోళన అనంతరం షర్మిల ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అధికార పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి షర్మిల కండువా వేసి ఆహ్వానం పలికారు.

కాంగ్రెస్‌లో ఉత్సాహం
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. స్ట్రెచర్‌పై పడి ఉన్న పార్టీకి షర్మిల ప్రాణం పోస్తారని కాంగ్రెస్‌  భావిస్తోంది. విభజన పూర్తయి దాదాపు పదేళ్లు కావొస్తుండడంతో చేసిన పనిని మరిచిపోయి షర్మిల ద్వారా ఓట్లు పడతాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. షర్మిల రాకతో పార్టీ బలోపేతం అవుతుందని, సుదీర్ఘకాలం పాటు ఆ పదవిలో కొనసాగుతారని షర్మిల వర్గం నాయకులతోపాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.

Also Read: Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News