ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. ఆంధ్రాను హడలెత్తిస్తున్న పెథాయ్ తుఫాన్!

ఉగ్రరూపం దాల్చిన సముద్రం 

Last Updated : Dec 16, 2018, 06:49 PM IST
ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. ఆంధ్రాను హడలెత్తిస్తున్న పెథాయ్ తుఫాన్!

విశాఖపట్టణం: పెథాయ్‌ తుపాన్ గంటకు 17 కిమీ వేగంతో ఆంధ్రా తీరంవైపు దీసుకొస్తోంది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 540 కిమీ, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంలో 690 కిమీ దూరంలో పెథాయ్ తుఫాన్ కేంద్రీకృతమై వుంది. పెథాయ్ తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆర్టీజీఎస్ అధికారులు.. క్షేత్రస్థాయిలోని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందితోపాటు ఇతర అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో పెథాయ్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిమీ వేగంతో గాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 

Cyclone Phethai live updates from Andhra Pradesh

తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగగా.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురుస్తున్నాయి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ఓడరేవుల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ సముంద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బలగాలు రంగంలోకి దిగాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెం. 1100ను ప్రకటించింది. 

2 నెలల క్రితం తిత్లి తుఫాన్, ఇటీవల గజ తుఫాన్ ఇప్పటికే తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తంచేస్తున్న రైతులు.. ఈసారి పెథాయ్ తుపాన్‌ కారణంగా మరోసారి తమ పంటల్ని నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. దీంతో పలు మార్కెట్ కేంద్రాల్లో 24 గంటలు పని చేసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాన్ తీరం దాటితే కానీ, దాని పర్యావసనాలు ఏ విధంగా వుంటాయో చెప్పడం కష్టమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Trending News